మేకప్, కెమెరా, యాక్షన్, ప్యాకప్ అంటూ సినీ తారల జీవితం జోరుగా సాగేది కొన్నాళ్లే. హిట్లు కొట్టినా.. తర్వాత సరైన ఆఫర్లు రాక కెరీర్ ఆపేసినవారు చాలా మంది ఉన్నారు. ప్రేక్షకుల ఆదరణ, అభిమానం ఉంటే తప్ప ఇక్కడ దశాబ్దాల పాటు రాణించడం కష్టం. కథానాయకుల విషయం ఏమో కానీ కథానాయికలు వెలిగేది మాత్రం కొన్ని రోజులే. మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోయిన ముద్దుగుమ్మలూ ఉన్నారు. కొందరు అవకాశాలు లేక వెండితెరకు దూరమైతే.. మరి కొందరు పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యారు. నటీమణులు అన్షు, రిచా పల్లోడ్, అనురాధ మెహతా, నేహా లాంటి నాయికలు తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. తర్వాత క్రమేపీ వెండితెరపై కనిపించలేదు. ఇలా టాలీవుడ్‌లో మెరిసిన భామల జాబితా ఓసారి చూద్దాం..
|
షామిలీ
![]()
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘కిల్లర్’, ‘నిప్పురవ్వ’ తదితర చిత్రాలతో బాలనటిగా మెప్పించారు షామిలీ. ఆ తర్వాత 2009లో ‘ఓయ్’ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు దక్కుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నది జరగలేదు. ఆమె గత ఏడాది ‘అమ్మమ్మగారిల్లు’లో కనిపించారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామనుకున్న షామిలీకి నిరాశే ఎదురైంది.
|
అనురాధ మెహతా
![]()
2004లో ‘ఆర్య’తో నటిగా అరంగేట్రం చేసింది అనురాధ మెహతా. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే ఆ విజయం ఆమెకు పెద్దగా సాయం చేయలేదు. ఆ తర్వాత అల్లరి నరేష్, ఆర్యన్ రాజేశ్ కలసి ‘నువ్వంటే నాకిష్టం’లో నటించారు. 2007లో ‘మహారాజశ్రీ’, ‘వేడుక’ లాంటి సినిమాల్లో నటించారు. అయితే వేటిలోనూ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరమయ్యారు.
|
అన్షు
![]()
‘నేను నేనుగా లేనే నిన్నమొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా..’ అంటూ ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున తన ప్రేయసిని చూసి మైమరచి పాడారు. ఆమే అన్షు. 2002లో ‘మన్మథుడు’ హిట్ తర్వాత ఆమె ప్రభాస్ ‘రాఘవేంద్ర’లో నటించారు. తర్వాత ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు. పెళ్లి అయ్యాక అన్షు లండన్‌లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది.
|
నేహా శర్మ
![]()
రామ్‌చరణ్ ‘చిరుత’ (2007) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా శర్మ. సినిమాలో ఆమె యాటిట్యూడ్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆమె వరుణ్ సందేశ్‌కు జోడీగా ‘కుర్రాడు’లో నటించారు. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. దీంతో ఆమె అలా అలా టాలీవుడ్‌కు దూరమయ్యారు.
|
గౌరీ ముంజల్
![]()
అల్లు అర్జున్ ‘బన్ని’ సినిమాతో అరంగేట్రం చేసిన నటి గౌరీ ముంజల్. తొలి సినిమాలో ముద్దుగా, అందంగా కనిపించిన గౌరీకి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ కథల ఎంపికలో ఆమె విఫలమై... కెరీర్ ముందుకు సాగలేదు. ఆమె ‘బంగారు బాబు’లో (2009) చివరిసారి తెలుగు తెరపై కనిపించారు.
|
రిచా పల్లోడ్
![]()
‘నువ్వే కావాలి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నటి రిచా పల్లోడ్. ఆ సినిమా విజయంతో రిచాకు ఛాన్స్‌లు వరుస కట్టాయి. దీంతో వరుసగా ‘చిరుజల్లు’, ‘హోలీ’, ‘ఇంకోసారి’ లాంటి సినిమాల్లో నటించారు. అవేవీ ఆమెకు విజయాన్ని అందించలేదు. తర్వాత నటనకు దూరమైన రిచా వివాహం చేసుకున్నారు. ఓ బాబుకు జన్మనిచ్చారు.
|
నేహా బ్యాంబ్
![]()
నితిన్ ‘దిల్’తో కుర్రకారు దిల్‌లో తిష్ఠ వేసిన అందం నేహా బ్యాంబ్. ఆ తర్వాత జగపతిబాబు ‘అతడే ఒకసైన్యం’, శివ బాలాజీ ‘దోస్త్’ సినిమాల్లో నటించిన ఆమె.. ‘బొమ్మరిల్లు’లో అతిథి పాత్రలో కనిపించారు. 2009లో ఓ టీవీ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించారు. 2007లో ఆమె రిషిరాజ్ ఝవేరీని వివాహం చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబరులో వీరికి పాప పుట్టింది.
|
భానుశ్రీ మెహ్రా
![]()
అల్లు అర్జున్ ‘వరుడు’ (2010) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి భానుశ్రీ మెహ్రా. సినిమా ప్రచారం కోసం ఈమెను ప్రచారంలో పెద్దగా చూపించలేదు. ఆ తర్వాత అవకాశాలు లేక ఆమె ఎవరికీ కనిపించలేదు. ‘గోవిందుడు అందరివాడేలే’లో అతిథి పాత్రలో కనిపించారు. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’, ‘అలా ఎలా’ సినిమాల్లో నటించినా బ్రేక్ రాలేదు.
|
సారా జేన్ డయాస్
![]()
ఫెమినా మిస్ ఇండియా -2007 కిరీటం గెలుచుకున్న అందాల భామ సారా జేన్ డయాస్. పవన్ కల్యాణ్ ‘పంజా’ (2011)తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో ఆమె తర్వాత ఇక్కడ రెండో ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. బాలీవుడ్‌లో ఒకటి రెండు సినిమాల్లో కనిపిందంతే.
|
మీరా చోప్రా
![]()
పవన్ కల్యాణ్ ‘బంగారం’ (2006) సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన నటి మీరా చోప్రా. ప్రియాంక చోప్రాకు దగ్గరి బంధువైన మీరా ఆ తర్వాత ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ సినిమాలో సందడి చేశారు. ఈ సినిమాలేవీ ఆమెకు విజయాన్ని అందించలేదు. దీంతో సినిమాలకు దూరమయ్యారు.
|










